పుస్తకాలు పట్టాల్సిన చేతులు.
ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి?
కలలు కనాల్సిన కళ్లలో
కసి అనే చీకటి ఎందుకు నిండింది?
పదో తరగతి
భవిష్యత్తుకు తొలి మెట్టు,
జీవితాన్ని నిర్మించుకునే వయసు,
అమ్మానాన్నల ఆశలకు ప్రతిరూపం,
గురువుల కలలకు ప్రతిబింబం.
అలాంటి వయసులో
ఒక మనిషి ప్రాణం విలువ
ఎందుకు మరచిపోయారు?
ఒక్కసారి ఆలోచిద్దాం
తప్పు చేసిన చేతులను మాత్రమే చూస్తామా?
లేక ఆ చేతులు తప్పు దారి పట్టే వరకు
వాటిని పట్టుకోని మన చేతులను కూడా ప్రశ్నించుకుంటామా?
మార్కులు అడిగాం
ర్యాంకులు అడిగాం
ఎన్ని మార్కులు వచ్చాయని అడిగాం
కానీ ఒక్కసారి అయినా
*నీ మనసులో ఏముంది బిడ్డా?*
*అని అడిగామా?*
పరీక్షల్లో ఎలా రాయాలో నేర్పాం
జీవితంలో ఎలా నడవాలో నేర్పామా?
గెలుపు కోసం పరుగెత్తమన్నాం.
ఓటమిని ఎలా స్వీకరించాలో చెప్పామా?
డబ్బు సంపాదించడం నేర్పాం.
డబ్బు కోసం మనిషితనాన్ని కోల్పోకూడదని చెప్పామా?
స్వేచ్ఛ ఇచ్చాం.
బాధ్యతను నేర్పామా?
*తల్లిదండ్రులారా*
*మీ బిడ్డ చేతిలో* *ఉన్న ఫోన్* *కనిపిస్తోంది,*
కానీ ఆ ఫోన్‌లోకి జారుతున్న ప్రపంచం కనిపిస్తుందా?
వాడు ఎవరితో తిరుగుతున్నాడో తెలుసా?
ఎందుకు తరచూ డబ్బు అడుగుతున్నాడో తెలుసా?
ఎందుకు కోపంగా ఉంటున్నాడో తెలుసా?
ఎందుకు ఒంటరిగా మారుతున్నాడో తెలుసా?
వాడి గదిలో ఖరీదైన వస్తువులు ఉండొచ్చు.
కానీ వాడి హృదయంలో
ఒంటరితనం ఉండకూడదు.
బిడ్డకు అన్నీ కొనివ్వడం ప్రేమ కాదు.
అవసరమైనప్పుడు
పక్కన కూర్చొని వినడం కూడా ప్రేమే.
గురువులారా
మీ చేతిలో పాఠ్యపుస్తకం మాత్రమే కాదు,
ఒక విద్యార్థి భవిష్యత్తు కూడా ఉంది.
మార్కులు తగ్గినప్పుడు
ప్రశ్నించండి.
కానీ మనసు మారినప్పుడు
ఇంకా ఎక్కువగా ప్రశ్నించండి.
ప్రవర్తనలో మార్పు కనిపిస్తే
శిక్షించే ముందు.
అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
ఒక విద్యార్థి
పరీక్షలో ఓడిపోతే
మళ్లీ గెలిచే అవకాశం ఉంటుంది.
కానీ.
జీవితంలో తప్పు దారిలోకి వెళ్లిపోతే
తిరిగి రావడం ఎంత కష్టమో
మనమందరం గుర్తుంచుకోవాలి
ప్రభుత్వాలారా
పాఠశాలలకు భవనాలు కావాలి,
ఉపాధ్యాయులు కావాలి,
పుస్తకాలు కావాలి.
అవన్నీ అవసరమే.
కానీ ప్రతి పాఠశాలలో
పిల్లల మనసును అర్థం చేసుకునే
కౌన్సెలింగ్ వ్యవస్థ కూడా కావాలి.
మత్తు పదార్థాల నుంచి
పిల్లలను కాపాడే చర్యలు కావాలి
పిల్లల ప్రవర్తనలో మార్పులను
సకాలంలో గుర్తించే వ్యవస్థ కావాలి
విద్య అంటే
కేవలం ఉద్యోగానికి దారి కాదు.
మంచి మనిషిగా మారడానికి
వేసే పునాది కూడా
సమాజమా
మన ముందు ఒక ప్రశ్న నిలిచింది.
పిల్లలు తప్పు చేసిన తర్వాత
వారిని వేలెత్తి చూపడం సులభం
కానీ,
వారు తప్పు దారిలోకి వెళ్లే ముందు
వారి భుజంపై చేయి వేయడం
మన బాధ్యత కాదా?
చెడు స్నేహం కనిపిస్తే
హెచ్చరించామా?
మత్తు పదార్థాల ప్రభావం కనిపిస్తే
అడ్డుకున్నామా?
అనవసరమైన డబ్బు చేతిలోకి వస్తే
ప్రశ్నించామా?
ఒక బిడ్డ మారుతున్నప్పుడు
వాడి సమస్య అని వదిలేశామా?
రూపా రెడ్డి మరణం
ఒక కుటుంబానికి తీరని విషాదం.
ఆమెను కోల్పోయిన కుటుంబానికి
ఆ బాధను ఏ మాటా తీర్చలేదు.
ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న
ఆ ఇద్దరు బాలల కుటుంబాలకూ
ఇది జీవితాంతం వెంటాడే విషాదమే.
న్యాయం తన మార్గంలో సాగాలి.
నిజం న్యాయస్థానంలో తేలాలి.
కానీ.
సమాజం మాత్రం
ఈ ఘటన నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి.
బిడ్డ తప్పు చేసినప్పుడు
ఎందుకు చేశావు? అని అడగడం కంటే.
ఎక్కడ తప్పిపోయావు? అని అడగాలి.
బిడ్డ కోపంగా ఉన్నప్పుడు
నోరు మూయి అనడం కంటే.
ఏమైంది? అని అడగాలి.
బిడ్డ దూరమవుతున్నప్పుడు
వాడి స్వభావమే అంత అనడం కంటే.
వాడి దగ్గరకు ఎలా చేరాలి? అని ఆలోచించాలి.
ఎందుకంటే.
ఒక చిన్న నిర్లక్ష్యం
ఒక పెద్ద విషాదానికి దారి తీయవచ్చు.
ఒక చిన్న మాట
ఒక జీవితాన్ని మార్చవచ్చు.
ఒక ప్రేమతో కూడిన చేయి
ఒక బిడ్డను తప్పు దారి నుంచి వెనక్కి తీసుకురావచ్చు.
పిల్లల చేతుల్లో
కత్తులు కాదు... పుస్తకాలు ఉండాలి.
కళ్లలో
కసి కాదు... కలలు ఉండాలి.
మనసులో
ద్వేషం కాదు... దయ ఉండాలి.
జీవితంలో
జల్సా కాదు
లక్ష్యం ఉండాలి.
స్నేహంలో
తప్పుదారి కాదు. తోడ్పాటు ఉండాలి.
విద్యలో
మార్కులు మాత్రమే కాదు... విలువలు ఉండాలి.
కుటుంబంలో
సౌకర్యాలు మాత్రమే కాదు... సంభాషణ ఉండాలి.
పాఠశాలలో
పాఠాలు మాత్రమే కాదు... మానవత్వం ఉండాలి.
ప్రభుత్వంలో
చట్టాలు మాత్రమే కాదు... ముందస్తు రక్షణ ఉండాలి.
సమాజంలో
విమర్శ మాత్రమే కాదు... బాధ్యత ఉండాలి.
ఈ రోజు రూపా రెడ్డి ఘటన
మన గుండెల్లో ఒక ప్రశ్నగా నిలిచింది.
మన పిల్లలను మనం ఏ దిశలో తీసుకెళ్తున్నాం?
ఆ ప్రశ్నకు సమాధానం
రేపటి పిల్లల జీవితాల్లో కనిపించాలి.
ప్రతి తల్లిదండ్రి
ఒక్కసారి తన బిడ్డను హత్తుకోవాలి.
ప్రతి గురువు
ఒక్కసారి తన విద్యార్థి మనసును చదవాలి.
ప్రతి పాఠశాల
ఒక్కసారి తన బాధ్యతను గుర్తు చేసుకోవాలి.
ప్రతి ప్రభుత్వం
ఒక్కసారి బాలల భవిష్యత్తును ముందుగా చూడాలి.
ప్రతి మనిషి
ఒక్కసారి తన సమాజాన్ని ప్రశ్నించుకోవాలి.
ఎందుకంటే?
పిల్లల భవిష్యత్తు
వారి చేతుల్లోనే ఉందని అనుకోవడం పొరపాటు.
వారి చేతులను ఏ దిశలో నడిపిస్తున్నామో
అది మన చేతుల్లో ఉంది.
పుస్తకాలు పట్టే చేతులను
మనం ప్రేమతో పట్టుకుందాం.
కలలు కనే కళ్లను
మనం వెలుగుతో నింపుదాం.
మంచి మార్కులకంటే ముందు
మంచి మనసును పెంచుదాం.
అప్పుడు మాత్రమే
మన పిల్లల భవిష్యత్తు సురక్షితం.
అప్పుడు మాత్రమే
ఒక గురువు జీవితం
ఒక పాఠంగా మిగులుతుంది.
ఒక విషాదం
వేల కుటుంబాలకు హెచ్చరికగా మారుతుంది.
మరొక బిడ్డ
తప్పు దారి పట్టకుండా
మన సమాజం ముందుగానే
ఆ బిడ్డ చేతిని పట్టుకోగలుగుతుందిపిల్లలను కాపాడటం
కేవలం తల్లిదండ్రుల బాధ్యత కాదు.
అది కుటుంబం, గురువు, ప్రభుత్వం, సమాజం
అందరి సమిష్టి బాధ్యత.
పుస్తకాలు పట్టాల్సిన చేతులకు
పుస్తకాలనే అందిద్దాం.
కలలు కనాల్సిన కళ్లకు
వెలుగునే చూపిద్దాం...
మన పిల్లలను
మంచి భవిష్యత్తు వైపు నడిపిద్దాం.
వి.జానకి రాములు గౌడ్
జడ్చర్ల
Telangana
పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి?
Quick Summary:
పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి?