22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
హైదరాబాద్: 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూమి ప్రైవేటు భూమిగా నిర్ధారణ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం కోసం సరైన జాబితాను రూపొందించాలని సీఎం సూచించారు. జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఎలాంటి పుకార్లు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Telangana
22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
Quick Summary:
22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు